పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులలో ప్రసంగించిన లోకేశ్, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి బలమైన పునాదులతో సాగాలని ఆకాంక్షించారు. కూటమిలో ఎక్కడా విభేదాలకు తావుండకూడదని, ఒకవేళ చిన్నపాటి సమస్యలు తలెత్తినా వాటిని అధినాయకత్వం వెంటనే సరిదిద్దుతుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా “కూటమిలో విడాకులు, మిస్ ఫైర్లు ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్న కూడా చెబుతున్నారు” అని పేర్కొంటూ, ఇద్దరు నేతల మధ్య ఉన్న సమన్వయాన్ని చాటిచెప్పారు.
కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూనే, వారిని అప్రమత్తం చేశారు. “కార్యకర్తల అలక కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు” అని వ్యాఖ్యానించిన లోకేశ్, కార్యకర్తలు అలిగితే అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనని గుర్తుచేశారు. పార్టీ లోపల ఏవైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా పోరాడదామని, కానీ బయటకు మాత్రం ‘జై టీడీపీ-జై కూటమి’ అంటూ ఐక్యంగా నినదించాలని పిలుపునిచ్చారు.
పాలన మరియు పార్టీ మధ్య ఉండాల్సిన వ్యత్యాసాన్ని మంత్రులకు గుర్తుచేస్తూ లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పార్టీ సొంతిల్లు.. ప్రభుత్వం అద్దె ఇల్లు” అని, అధికారంలో ఉన్నామన్న గర్వంతో కాకుండా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నారని, మంత్రులందరూ కూడా అదే బాటలో నడవాలని దిశానిర్దేశం చేశారు.