మాజీ మంత్రి జోగి రమేశ్‌ను జైలులో కలిసిన అనంతరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే రమేశ్‌ను 83 రోజులుగా జైలులో ఉంచారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చివరికి జోగి రమేశ్‌ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.
మద్యం పాలసీ మరియు కల్తీ మద్యంపై కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోందని, చంద్రబాబు సొంత జిల్లా నుంచే ఇది సరఫరా అవుతోందని ఆరోపించారు. బెల్టు షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని, ఇప్పుడు గ్రామానికి నాలుగు షాపులు వెలిశాయని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం వల్ల కడప జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ.. తనపై ఉన్న కేసులను ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ కింద కొట్టేయించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు.
తిరుపతి లడ్డూ వివాదంపై కూడా కేతిరెడ్డి స్పందించారు. లడ్డూలో పంది కొవ్వు కలిసిందని సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ప్రచారం తప్పని ఇప్పుడు తేలిపోయిందని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవారు హిందూ మతాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. జగన్ హయాంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తే పట్టించుకోని వారు, మంచి మద్యం ఇస్తామంటే చప్పట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టిన వారిని చట్టపరంగా వదిలిపెట్టబోమని, ఈ వేధింపులపై న్యాయపోరాటం చేస్తామని కేతిరెడ్డి హెచ్చరించారు.