తేది:26-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ బొంతల రాకేష్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్. నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య 250 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుతున్నాయంటే దానికి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందన్నారు.
వర్ధన్నపేటకు మమునూర్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితమని పేర్కొన్నారు. తాను గతంలో వైద్యురాలిగా పనిచేసిన ఏరియా ఆసుపత్రికి ఇప్పుడు సొంత భవనం నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ. 1 కోటి 30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.