నకిలీ మద్యం కేసులో అరెస్టై, 83 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్‌ను అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై మరియు మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ నిర్వహిస్తున్న ‘రెడ్ బుక్’ కేవలం రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శనమని, అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయపెట్టలేరని స్పష్టం చేశారు.
“రెడ్ బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. అందులో నా పేరుందో లేదో చూసి చెప్పండి. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్లం, జగన్ కష్టకాలంలో అండగా ఉన్నవాళ్లం.. ఇలాంటి పిచ్చి బుక్కులకు భయపడే పిరికిపందలం కాదు” అంటూ అంబటి ఎద్దేవా చేశారు. రాజకీయ పంతాల కోసం చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్‌ను కావాలనే ఇన్ని రోజులు జైల్లో ఉంచారని, చంద్రబాబు ఎంత హింసిస్తే వైసీపీ నేతలు అంత పట్టుదలగా పోరాడుతారని ఆయన పేర్కొన్నారు.
దేవాలయాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని అంబటి విమర్శించారు. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని దర్యాప్తు సంస్థల నివేదికల ద్వారా స్పష్టమవుతోందని, అయినా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయం అంతా అధికారం అడ్డం పెట్టుకుని సాగుతోందని, ఆయన పోకడలే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది పలుకుతాయని అంబటి జోస్యం చెప్పారు.