బంగారం, వెండి ధరలపై బడ్జెట్ ప్రభావం: దిగుమతి సుంకాలు తగ్గాలని రిఫైనర్ల విన్నపం!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టబోయే పార్లమెంట్ బడ్జెట్‌పై దేశీయ విలువైన లోహాల రిఫైనింగ్ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) కారణంగా స్థానిక రిఫైనర్ల కంటే దిగుమతిదారులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని, దీనివల్ల దేశీయ పరిశ్రమ దెబ్బతింటోందని MMTC-PAMP మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ గుహా ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతి సుంకాల విధానంలో మార్పులు చేసి, స్థానిక శుద్ధి కర్మాగారాలకు (Refineries) ఊతం ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం డోర్ (అశుద్ధి చేసిన లోహం) దిగుమతులపై బంగారం, వెండి రెండింటికీ 6% సుంకం విధిస్తున్నారు. అయితే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) వంటి మార్గాల ద్వారా దిగుమతి అయ్యే బులియన్ కారణంగా దేశీయ రిఫైనర్లు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే, భవిష్యత్తులో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాల నుంచి బంగారం, వెండిని తప్పించాలని లేదా తక్కువ సుంకాల విధానం నుంచి మినహాయించాలని పరిశ్రమ కోరుతోంది. భారత్‌ను గ్లోబల్ రిఫైనింగ్ హబ్‌గా మార్చాలంటే ఇన్-పుట్ ఆధారిత ప్రోత్సాహకాలు మరియు సుంకాల వ్యత్యాసాన్ని సరిదిద్దడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు, దేశంలో వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో MMTC-PAMP సుమారు 40 టన్నుల బంగారం, 50 టన్నుల వెండిని దిగుమతి చేసుకోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే వెండి దిగుమతులు 60 టన్నులకు చేరడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, సామాన్యులకు ఉపశమనం కలిగించేలా బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తారా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుంకాలు తగ్గితే దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *