నేరస్తుల చేతిలో రాజకీయాలతో ఏపీ నాశనం: నగరిలో సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులు నాశనం చేశారని, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తుకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన జీవన విధానంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇల్లు ఒక్కటే కాదు, మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లడం వల్ల భూగర్భ జలాలు, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ఆ వ్యర్థాలను తొలగించి, రాష్ట్రవ్యాప్తంగా 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను క్లియర్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ మరియు ఈ-వేస్ట్‌ను సేకరించేందుకు ప్రస్తుతం 130 స్వచ్ఛ రథాలు అందుబాటులో ఉన్నాయని, 2026 మార్చి నాటికి వీటి సంఖ్యను 660కి పెంచుతామని హామీ ఇచ్చారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లను కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ‘సూపర్ సిక్స్’ పథకాలు రాష్ట్రంలో విజయవంతమయ్యాయని, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా కింద రూ. 33 వేల కోట్ల పెన్షన్ల పంపిణీ వంటివి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. పాఠశాల విద్యార్థుల్లో పరిశుభ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ‘ముస్తాబు’ అనే వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *