ఆన్‌లైన్ సర్వీస్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న మసాజ్ సర్వీస్‌ను రద్దు చేసుకున్నందుకు ఓ మహిళపై థెరపిస్ట్ భౌతిక దాడికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ముంబైలోని వడాలా ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల షహనాజ్ సయ్యద్, తన భుజం నొప్పి (ఫ్రోజెన్ షోల్డర్) చికిత్స కోసం ‘అర్బన్ కంపెనీ’ యాప్ ద్వారా మసాజ్ సర్వీస్‌ను బుక్ చేసుకున్నారు. అయితే, ఇంటికి వచ్చిన థెరపిస్ట్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం మరియు ప్రైవసీ సమస్యల కారణంగా ఆమె బుకింగ్‌ను రద్దు చేయడంతో ఈ గొడవ మొదలైంది.
బుకింగ్ రద్దు చేయడాన్ని తట్టుకోలేని థెరపిస్ట్ తీవ్ర ఆగ్రహంతో షహనాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. బాధితురాలి జుట్టు పట్టుకుని లాగి, ముఖంపై పిడిగుద్దులు కురిపించడమే కాకుండా గోళ్లతో రక్కినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన షహనాజ్ 18 ఏళ్ల కుమారుడిని కూడా నిందితురాలు తోసివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వడాలా టీటీ పోలీసులు థెరపిస్ట్‌పై నాన్-కాగ్నిజబుల్ (NC) కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ‘అర్బన్ కంపెనీ’ స్పందిస్తూ సదరు థెరపిస్ట్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా తొలగించినట్లు ప్రకటించింది. ఇంటి వద్దకు వచ్చే సర్వీసుల విషయంలో భద్రతా ప్రమాణాలు మరియు సిబ్బంది ప్రవర్తనపై ఈ ఘటన పలు సందేహాలను రేకెత్తిస్తోంది.