అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన విజయ్ కుమార్ (51) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపాడు. గ్విన్నెట్ కౌంటీలోని లారెన్స్‌విల్లే ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
పోలీసుల కథనం ప్రకారం, మృతులను విజయ్ కుమార్ భార్య మీమూ డోగ్రా (43), బంధువులు గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్‌గా గుర్తించారు. తొలుత అట్లాంటాలోని తమ నివాసంలో దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. అనంతరం వారు లారెన్స్‌విల్లేలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. మృతుల్లో ఒకరు భారతీయ పౌరుడు ఉన్నట్లు సమాచారం అందడంతో భారత దౌత్య కార్యాలయం బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది.
ఈ భయానక ఘటన సమయంలో ఇంట్లోనే ఉన్న ముగ్గురు చిన్నారులు క్లోజెట్‌లో దాక్కుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒక చిన్నారి సమయస్ఫూర్తితో 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడం గమనార్హం. ప్రస్తుతం ఆ పిల్లలను బంధువుల సంరక్షణలో ఉంచారు. నిందితుడు విజయ్ కుమార్‌పై నాలుగు హత్య కేసులు మరియు చిన్నారుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.