ఒడిశా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. నికోటిన్ కలిగి ఉండే గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ, రవాణాపై రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు పెరుగుతుండడంతో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒడిశా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు లేదా నికోటిన్ కలిగిన అన్ని ఉత్పత్తులు, ప్యాక్ చేసిన లేదా ప్యాక్ చేయని పొగాకు ఉత్పత్తులను నిషేధించింది.
“పాన్ మసాలా, తమలపాకు, అరెకా గింజ, స్లాక్డ్ లైమ్, ఇతర ప్రాసెస్డ్, రుచిగల, మసాలా దినుసులు వంటి ఆహార పదార్థాలతో పాటు పొగాకును విస్తృతంగా ఉపయోగించడం ప్రజారోగ్యానికి హానికరం. ముఖ్యంగా పిల్లలు, యువకుల ఆరోగ్యానికి ప్రాణాంతకం” అని నోటిఫికేషన్ లో ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. పొగాకు నవలడం వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. పొగాకు కారణంగా.. నోరు, అన్నవాహిక, కడుపు, ప్యాంక్రియాటిక్, గొంతు, మూత్రపిండాల క్యాన్సర్‌ల వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశాలో 42 శాతం
ఒడిశా జనాభాలో 42% మంది పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అని సర్వేలు చెబుతున్నాయి. 2016 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు పొగాకుతో కలిపిన పాన్ మసాలాను ప్రత్యేక ప్యాకేజీలలో అమ్ముతూ.. గుట్కా నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించింది. పొగాకు లేదా నికోటిన్‌తో గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.