దేశీయ రైల్వే చరిత్రలో సరి కొత్త అధ్యాయం మొదలైంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తొలిసారి ‘ఏఎస్సీ అర్జున్’ అనే హ్యూమనాయిడ్ రోబో ఎంట్రీ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే దీన్ని గురువారం ప్రారంభించింది. రైల్వే కార్యకలాపాల్లో ఆధునిక టెక్నాలజీని వినియోగించడంలో ఇదొక మైలురాయి. ఇంతకీ ఈ రోబో చేసే విధులేంటి? లోతుల్లోకి వెళ్తే..
విశాఖ రైల్వేస్టేషన్‌లో ‘రోబో పోలీస్’
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ ASC ARJUNను విధుల్లోకి చేరింది. ప్రయాణీకుల భద్రత, సేవలు మెరుగుపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం రైల్వేల్లో ఇదొక కీలక అడుగు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
ప్రయాణికుల భద్రత, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, మెరుగైన సేవలు అందించడం, రద్దీని నియంత్రించడం, పరిశుభ్రతను పర్యవేక్షణ వంటివి ఈ రోబో లక్ష్యమని రైల్వే అధికారులు చెప్పారు. రోబోని పూర్తిగా విశాఖపట్నంలో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. ఏడాదికి సమయం కేటాయించి దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు.
దేశంలో తొలిసారి, డ్యూటీ మాటేంటి?
ఏఐ, ఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో స్టేషన్‌లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తించనుంది రోబో. తరచూ దొంగతనాలకు పాల్పడే వారి ఫోటోలు తీసి విశ్లేషించడం, రద్దీ పెరిగితే ప్రయాణికులను అప్రమత్తం చేయడం ఎప్పటికప్పుడు చేస్తోందని అధికారులు వివరించారు. విశాఖకు చెందిన ఓ కంపెనీ దీన్ని తయారు చేసింది. రైల్వే పోలీసులు ఈ రోబోకు ‘ఏఎస్‌సీ అర్జున్’ అని పేరు పెట్టారు.
రైల్వే స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఏఐ ద్వారా అంచనా వేయడంలో ఈ రోబో సహకరిస్తుంది. అంతేకాదు భద్రతా సిబ్బంది అవసరమని ఆ ప్రాంతాలకు రోబోను పంపుతారు. కేవలం హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది ఈ రోబో. స్టేషన్‌లో అగ్నిప్రమాదాలు, పొగ రావడం వాటిని గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేయనుంది.
నిత్యం స్టేషన్‌లో ఉండి ఇక్కడికి వచ్చే వారి ఫొటోలు తీస్తుంది. దీనికితోడు అనుమానితులు, తరచూ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారి గుర్తించి వారి సమాచారం అధికారులకు పంపనుంది. ప్రస్తుతానికి ఇవీ తన ప్రత్యేకతలని చెప్పుకొచ్చారు. తాను విశాఖలో పుట్టానని, రోబో కాప్లర్ సంస్థ తనను తయారు చేసిందని వివరించింది.