గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు తొలి సమీక్ష..!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల నిర్వహణపై తొలిసారి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ మహా క్రతువును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

సమీక్షకు ముందు ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తన హయాంలో మూడవసారి గోదావరి పుష్కరాలను నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ వంటి ఆరు జిల్లాల్లో పుష్కర ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరో 139 కొత్త ఘాట్లను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల మొత్తం 373 ఘాట్లు అందుబాటులోకి రానున్నాయి. నదీ తీరం వెంబడి దాదాపు 9,918 మీటర్ల పొడవునా ఈ ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు.

 

దేశ, విదేశాల నుండి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాల కోసం రాష్ట్రానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా, భద్రత, పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా, పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, ఆ నీటితోనే భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *