తేది:23-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటిసి కంపెనీలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ArriveAlive కార్యక్రమం 8వ రోజు సందర్భంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్మికులు, డ్రైవర్లు రోజూ రాకపోకలు సాగించే పరిశ్రమల ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలన్నారు. వేగ నియంత్రణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తినే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు.
రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. “వేగం కాదు – జీవితం గెలవాలి” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల యాజమాన్యం, పోలీసులు, సిబ్బంది, కార్మికులు, డ్రైవర్లు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రమాదాల నివారణకు ఎంతో దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.