నిజాయితీగా వంద కోట్లు వస్తేనే పోస్టర్ వేస్తాం: ఫేక్ కలెక్షన్లపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న మెగా ఫ్యాన్స్!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల మధ్య కలెక్షన్ల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల నిర్మాతలు భారీ వసూళ్ల పోస్టర్లతో సందడి చేస్తుండగా, ‘నారీ నారీ నడుమ మురారి’ టీమ్ మాత్రం భిన్నమైన వైఖరిని అవలంబించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో శర్వానంద్ మరియు నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. తమ సినిమాకు నిజాయితీగా 100 కోట్ల గ్రాస్ వచ్చినప్పుడే పోస్టర్ వేస్తామని, తప్పుడు అంకెలు వేయడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

శర్వానంద్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా కలెక్షన్ పోస్టర్లు వేయలేదని, ప్రేక్షకులకు సినిమా ఏంటో తెలుసని అన్నారు. గతంలో ‘శతమానం భవతి’ కూడా వంద కోట్లు వసూలు చేసినా ప్రచారం చేసుకోలేదని గుర్తుచేశారు. నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ.. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా తమ సినిమాకు 70-80 శాతం బుకింగ్స్ ఉండటమే అసలైన విజయమని, షోలు పెంచిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఇతర సినిమాలకు వీక్‌డేస్‌లో డ్రాప్స్ ఉన్నా, తమ చిత్రానికి మాత్రం ప్రేక్షకుల మద్దతు బాగుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే, శర్వానంద్ మరియు అనిల్ సుంకర చేసిన ఈ “నిజాయితీ” వ్యాఖ్యలు ఇతర సంక్రాంతి సినిమాలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వారం రోజుల్లోనే రూ. 292 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు పోస్టర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో, శర్వానంద్ వ్యాఖ్యలు పరోక్షంగా మెగాస్టార్ సినిమాను ఉద్దేశించినవేనంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సినిమాల కలెక్షన్ల అంకెలు ఫేక్ అంటూ నెట్టింట నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *