తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ (SIT) నోటీసుల నేపథ్యంలో సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన, ట్యాపింగ్ వ్యవహారమంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇందులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం కేంద్ర హోంశాఖ ఫోన్లను ట్యాప్ చేసినట్లే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగినప్పుడు పోలీసులు నిఘా ఉంచుతారని, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తాము అడగమని ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన కేటీఆర్, అసలైన సమాచారం కావాలంటే మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, జితేందర్ మరియు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక నిరంతర ‘కార్తీక దీపం’ సీరియల్‌లా సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ కావడం లేదని అధికారులు ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరిన ఆయన, ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి కేసులను వాడుకుంటోందని ఆరోపించారు.
నోటీసుల ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు, ఇప్పుడు కేటీఆర్‌ను కూడా విచారించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌ను కేవలం సాక్షిగా మాత్రమే కాకుండా, ఈ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తిగా పోలీసులు పరిగణిస్తున్నట్లు సమాచారం. పక్కా సాంకేతిక ఆధారాలతో పోలీసులు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.