డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని కొనుగోలు చేసే విషయంలో ట్రంప్ తన పట్టును మరోసారి ప్రదర్శించారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి తాను సైనిక శక్తిని ఉపయోగించబోనని స్పష్టం చేసిన ఆయన, ఆ ద్వీపాన్ని అమెరికాకు విక్రయించేలా తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమని, ప్రపంచ రక్షణ దృష్ట్యా అది అమెరికాకు అత్యంత అవసరమని ఆయన వాదించారు. అయితే, తన ప్రసంగంలో గ్రీన్‌లాండ్‌కు బదులుగా ‘ఐస్‌లాండ్’ అనే పదాన్ని వాడటం సదస్సులో కొంత గందరగోళానికి దారితీసింది.
గ్రీన్‌లాండ్ విక్రయానికి నిరాకరిస్తున్న డెన్మార్క్ మరియు ఇతర ఐరోపా దేశాలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే అభినందిస్తామని, లేదంటే ఆ విషయాన్ని గుర్తుంచుకుంటామంటూ పరోక్షంగా ఆర్థిక ఆంక్షల హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రీన్‌లాండ్‌కు సైన్యాన్ని పంపిన 8 ఐరోపా దేశాల ఉత్పత్తులపై 10 శాతం అదనపు సుంకాలు (Tariffs) విధిస్తానని ఆయన ప్రకటించారు. ఈ హెచ్చరికలతో ఆగ్రహించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే వంటి కీలక నేతలు నిరసనగా చర్చల మధ్యలోనే వెళ్ళిపోవడం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఐరోపా దేశాల తీరుపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూ.. ఆ ఖండంలో వలసలపై నియంత్రణ లేదని, అవి సరైన దిశలో వెళ్లడం లేదని ఆరోపించారు. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను తాను తిరిగి సజీవంగా మార్చానని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా నిలిపానని చెప్పుకొచ్చారు. గతంలో విదేశీ వాణిజ్యం వల్ల అమెరికాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే తాము టారిఫ్‌లు పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు అమెరికా మరియు ఐరోపా దేశాల మధ్య ఒక ‘దౌత్య యుద్ధం’ మొదలైందనే సంకేతాలను ఇస్తున్నాయి.