గుంటూరులో దారుణం: ప్రియుడితో కలిసి భర్త హత్య.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ భార్య వికృత చేష్టలు!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక వికృత ఘటన వెలుగులోకి వచ్చింది. ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజును, అతడి భార్య లక్ష్మీమాధురి తన ప్రియుడు గోపితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. 2007లో వివాహమై ఇద్దరు పిల్లలున్న ఈ దంపతుల మధ్య, మాధురికి విజయవాడలో పరిచయమైన గోపితో ఏర్పడిన వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి, అతడిని వదిలించుకోవాలని పథకం వేసింది.

హత్య జరిగిన తీరు అత్యంత భయంకరంగా ఉంది. ఈ నెల 18న రాత్రి, మాధురి తన భర్తకు ఇష్టమైన బిర్యానీలో 20 నిద్రమాత్రలను పొడి చేసి కలిపింది. నాగరాజు స్పృహ కోల్పోయిన తర్వాత, రాత్రి 11:30 గంటల సమయంలో ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో అతడి ముక్కు, నోరు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి ఏమాత్రం చలనం లేకుండా రాత్రంతా ఒంటరిగా కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ గడపడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.

మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మాధురి డ్రామా ఆడింది. అయితే, అంత్యక్రియల సమయంలో నాగరాజు చెవి నుంచి రక్తం కారడం, ఛాతీపై గాయాలు ఉండటాన్ని గమనించిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించిందని, ఛాతీ ఎముకలు విరిగాయని తేలడంతో పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన ప్రియుడితో కలిసి చేసిన పాపాన్ని అంగీకరించింది. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *