వీధి శునకాల నియంత్రణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో న్యాయస్థానాన్ని ఉద్దేశించి చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె అందరిపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికే వస్తాయని, అయితే న్యాయస్థానం ఔన్నత్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా మేనకా గాంధీ తరఫు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఆమె కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలని ప్రశ్నించింది. వీధి శునకాలకు ఆహారం పెట్టే వారిని బాధ్యులుగా చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం సమర్థించుకుంది. సమస్య తీవ్రతను, సాధారణ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకునే తాము ఆ వ్యాఖ్యలు చేశామని, బాధ్యత లేకుండా విమర్శలు చేయడం తగదని హితవు పలికింది.
అంతేకాకుండా, వీధి కుక్కల విషయంలో భావోద్వేగాల కంటే వాస్తవికత ముఖ్యం అని కోర్టు పేర్కొంది. వీధి శునకాలకు ఆహారం అందించేవారు వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. మేనకా గాంధీ లాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు న్యాయ వ్యవస్థపై ఇటువంటి విమర్శలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది.