ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కానిస్టేబుల్ జయశాంతికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో లేనప్పటికీ, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి, ఆమె చూపిన నిబద్ధత పోలీసు శాఖపై ప్రజల్లో గౌరవాన్ని మరియు నమ్మకాన్ని మరింతగా పెంచిందని ప్రశంసించారు.
జయశాంతి వంటి వారు ప్రదర్శించే స్ఫూర్తిదాయకమైన చర్యలు సమాజానికి ఎంతో అవసరమని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. హోంమంత్రిని నేరుగా కలవాలన్న జయశాంతి కోరికకు స్పందిస్తూ, త్వరలోనే తప్పకుండా కలుద్దామని ఆమె హామీ ఇచ్చారు. విధి పట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఇతర పోలీసు అధికారులకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మంత్రి అనిత తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో కూడా జయశాంతిని అభినందిస్తూ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళా కానిస్టేబుల్ చూపిన చొరవను రాష్ట్ర హోంమంత్రి స్వయంగా గుర్తించి ప్రశంసించడం పోలీసు వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.