సంగారెడ్డి మున్సిపాలిటీకి మౌలిక వసతులబలోపేతం-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. రూ.31.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.

తేది:20-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా రూ.31.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హెచ్ఎండీ నిధులతో రూ.8 కోట్ల వ్యయంతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు, సీడీఎంఏ నిధులతో రాజీవ్ పార్క్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పథకం కింద రూ.18.70 కోట్లతో రోడ్లు, మురుగు కాలువలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నారు.
హెచ్ఎండీఏ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో రాజంపేటచౌరస్తా నుండి ఫిల్టర్ బెడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఫిల్టర్ బెడ్ మరమ్మత్తుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు బలోపేతం అయితే పట్టణాలు మరింత శుభ్రంగా, సురక్షితంగా మారుతాయని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మల జయప్రకాశ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ పాండు, రెవిన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *