తేది:19-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS వర్ధన్నపేట ఇంచార్జ్ రాకేష్ బొంతల.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిలదీతలు, నిరసనలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతుండంతో సొంత నియోజకర్గంలోనూ స్వేచ్ఛగా తిరుగలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. హామీల అమలులో విఫలమమతున్నారనే ఆరోపణలతోపాటు ఎమ్మెల్యే తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతుండటంతో విమర్శల పాలవుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా మహిళలు, రైతులు, యువకుల నుంచే గాక సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసనలు వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమలుకాని సంక్షేమ పథకాలు, హామీల ఎగవేతపై రోజుకో చోట ప్రజలు ప్రశ్నలతో నిలదీస్తున్నారు. తాజాగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రి కూడా ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. నియోజకవర్గ కేంద్రంలోనే దవాఖాన నిర్మించాలంటూ ఆస్పత్రి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 100 పడకల ఆస్పత్రిని పట్టణంలోనే నిర్మించడం అత్యవసరమని.. మరోప్రాంతానికి తరలించాలనే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే నాగరాజు హాజరుకాగా.. మహిళలు నిలదీశారు. వర్ధన్నపేటలో ఏం అభివృద్ధి చేశారని, ఉన్న ఆస్పత్రిని వేరే దగ్గరకు తరలించడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే నాగరాజుపై ఉన్న వ్యతిరేకత రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వరుస పరిణామాలు వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా ప్రభావంపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.