తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ దళపతికి కరూర్ తొక్కిసలాట కేసులో చుక్కెదురు కానుంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన రాజకీయ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ (CBI), ఫిబ్రవరిలో దాఖలు చేయనున్న ఛార్జిషీట్లో విజయ్ను నిందితుడిగా చేర్చే అవకాశముందని సమాచారం. సోమవారం ఢిల్లీలో జరిగిన రెండో విడత విచారణలో విజయ్ను అధికారులు సుమారు 90 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం సమయపాలన పాటించకపోవడమేనని సీబీఐ ప్రాథమికంగా భావిస్తోంది. సభకు మధ్యాహ్నం 12 గంటలకే రావాల్సిన విజయ్, ఏడు గంటల ఆలస్యంగా రాత్రి 7 గంటలకు చేరుకోవడంతో జనం భారీగా పెరిగిపోయి నియంత్రణ తప్పిందని అధికారులు గుర్తించారు. జనం అదుపు తప్పుతున్నా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు? జనసమూహాన్ని నియంత్రించడానికి పార్టీ తరఫున తీసుకున్న చర్యలేంటి? కిక్కిరిసిన జనం మధ్య ప్రచార వాహనాన్ని ఎందుకు ముందుకు పోనిచ్చారు? వంటి కీలక అంశాలపై విజయ్ నుంచి సీబీఐ వివరణ కోరింది. హత్యకు సమానం కాని నరహత్య సెక్షన్ల కింద ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులో కేవలం విజయ్ మాత్రమే కాకుండా, భద్రతా లోపాలపై ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఛార్జిషీట్లో ఉండే అవకాశం ఉంది. అప్పటి ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) డేవిడ్సన్ దేవశీర్వాదంను ఇప్పటికే సీబీఐ విచారించింది. ర్యాలీకి వచ్చిన జనం భద్రతను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు పోలీసు అధికారులను కూడా బాధ్యులను చేయాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై మరియు టీవీకే పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.