నటి రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. అయితే, పదవుల్లో లేకపోయినా సమాజంలో జరిగే అన్యాయాలపై, ముఖ్యంగా మూగజీవులపై జరుగుతున్న హింసపై తన గళం వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయ ఎంట్రీ కంటే సామాజిక బాధ్యతకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. చిన్నపిల్లలను కరుస్తున్నాయనే నెపంతో కుక్కలను సామూహికంగా హతమార్చడం అమానుషమని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో వాహనాల కింద పడి ఎన్నో కుక్కలు గాయపడుతున్నాయని, అవి వెళ్లి ఎవరికీ ఫిర్యాదు చేయలేవని గుర్తు చేశారు. మూగజీవుల రక్షణ కోసం తాను ప్రతిరోజూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని ఆమె తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక లక్షలాది మంది చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కానీ కుక్కల విషయంలో మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. మానవత్వంతో ఆలోచించి జంతువుల పట్ల కనికరం చూపాలని కోరారు. ఒకవైపు తన కెరీర్, మరోవైపు మూగజీవుల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని, ఇందుకోసం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.