శివాజీ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి ఫైర్: “చెప్పడానికి మీరెవరు?”

మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించడానికి శివాజీ ఎవరని ఆమె సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా, వారిని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. మహిళలను అణగదొక్కాలని చూసేవారికి తగిన గుణపాఠం చెబుతామని, ఇలాంటి నైతిక పోలీసుల (Moral Policing) పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఇదే సందర్భంలో ఆమె మహిళా అధికారులపై మీడియాలో వస్తున్న కథనాలపై కూడా మండిపడ్డారు. ఒక మహిళా అధికారి పట్ల తప్పుడు వార్తలు రాయడం రాజ్యాంగ విరుద్ధమని, అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని హితవు పలికారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై స్పందిస్తూ, పేదల హక్కులను కాలరాసే అధికారం ప్రధాని మోదీకి లేదని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుంటామని తెలిపారు.

ఖమ్మం జిల్లా రాజకీయాలపై కూడా రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని, తన గెలుపును ఆపే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి, తనను అడ్డుకునే సాహసం ఆయన చేయగలరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనలో భాగంగా ఆమె మహిళల హక్కుల కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *