ఏపీ రాజధానిపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన-మాస్టర్ ప్లాన్ ఆమోదంపై క్లారిటీ..!

ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి నాలుగేళ్లవుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ తరుణంలో రాజధానుల విషయలో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మరో ప్రశ్న ఎదురైంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. ఏపీ రాజధాని విషయంలో మరో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకూ సాగుతున్న చర్చలో ఇది మరో అంశంగా కనిపిస్తోంది.

 

ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రం మరోసారి పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టేసింది. ఈ మేరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కల్పించింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అన్న కేంద్రం.. మాస్టర్ ప్లాన్ ఆమోదంపై స్పందించేందుకు సదరు ఎంపీ అడిగిన ప్రశ్నేంటో తెలుసా ?

 

 

రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమన్నారు. ఏపీ రాజధాని అమరావతి తో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని ఆయన తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *