సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పండుగ సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు అంటే సుమారు కిలోమీటరు మేర విస్తరించాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అలిపిరి టోల్గేట్ నుంచే పరిస్థితిని గమనిస్తూ భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
దర్శన సమయాల వివరాలను పరిశీలిస్తే, టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 14 నుంచి 16 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఇక టైమ్ స్లాట్ (SSD) దర్శనం భక్తులకు 5 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండగా, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. పండుగ సెలవుల ప్రభావంతో రానున్న మరికొద్ది రోజుల పాటు ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత 24 గంటల గణాంకాల ప్రకారం, తిరుమల శ్రీవారిని మొత్తం 76,289 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,586 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.