


తేది:14-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో MDR Foundation ఆధ్వర్యంలో, మాద్రి పృథ్వీరాజ్ గారి సమక్షంలో సంప్రదాయ ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళాత్మక ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. రంగురంగుల ముగ్గులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు హాజరై పోటీలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాల్గొన్న వారందరినీ అభినందించి, విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజంలో సాంస్కృతిక విలువలను కాపాడేందుకు MDR ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదే సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ గారు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. భోగి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో యువకులతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడితో సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని పంచాలని అన్నారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని, ప్రజలందరూ సుభిక్షంగా, పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. చిన్నారులు ఎగురవేసే పతంగుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.