తేది:13-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: బాల్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ డి. మహేందర్ స్పష్టం చేశారు. బాలలను బడులకు పంపేలా తల్లిదండ్రులు, సమాజం ముందుకు రావాలని, బాల్యం కార్మికంగా మారకూడదని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో “ఆపరేషన్ స్మైల్” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులను పనిచేయిస్తున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలలో 26 మంది బాలలను గుర్తించి, వారిని సురక్షితంగా రక్షించి సంబంధిత శాఖల సహకారంతో పునరావాస చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
రక్షించబడిన బాలలను తిరిగి బడుల్లో చేర్పించేందుకు విద్యాశాఖ, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాల కార్మికులను పనిచేయించడం చట్టపరంగా నేరమని, అటువంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని అదనపు ఎస్పీ మహేందర్ ప్రజలను కోరారు.
బాలలకు విద్య, భద్రత, మంచి భవిష్యత్ కల్పించడమే “ఆపరేషన్ స్మైల్” లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన అన్నారు.