
తేది:12-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: యాసంగి పంట సాగుకు సింగూరు జలాశయం నుంచి వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వం వహించగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని విమర్శించారు. సింగూరు నీళ్లు ఘనపూర్ ఆయకట్టు కింద ఉన్న సుమారు 40 వేల ఎకరాలకు అందించాలని, లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగూరు జలాలు మెదక్ జిల్లా హక్కు అని, రైతులను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సింగూరు రిజర్వాయర్ మరమ్మత్తులు సమయానికి చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, సాగు నీటితో పాటు తాగునీటికీ సింగూరు జలాలు అందించాలని పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు చలి వాతావరణంలో క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉందని, యాప్ పేరుతో ఎరువుల పంపిణీలో రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా పోలీసులు బిఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు. గేటు వద్దే ఎమ్మెల్యే సునీత లక్ష్మరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ ధర్నాలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మామిడ్ల ఆంజనేయులు, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.