వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా డెల్టా ఫోర్స్ ‘సోనిక్ వెపన్’ (ధ్వని ఆయుధం) వాడినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా ప్రయోగించిన భయంకరమైన శబ్ద తరంగాల దాటికి వందలాది మంది వెనిజులా సైనికులు నిస్సహాయులయ్యారు. మదురో వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ ధ్వని తరంగాలు తలలో పేలుడు సంభవించినంత తీవ్రమైన నొప్పిని కలిగించాయని, దానివల్ల సైనికుల ముక్కుల నుంచి రక్తం కారడమే కాకుండా చాలా మంది వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయారని తెలిసింది.
జనవరి 3న జరిగిన ఈ దాడిలో కేవలం 20 మంది అమెరికా డెల్టా ఫోర్స్ సైనికులు అత్యాధునిక సాంకేతికతతో వందలాది మంది శత్రు సైనికులను నిర్వీర్యం చేయడం అంతర్జాతీయ రక్షణ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం శబ్దమే కాకుండా మైక్రోవేవ్స్ మరియు లేజర్ వంటి ‘డైరెక్టెడ్ ఎనర్జీ’ ఆయుధాల కలయిక అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవి శత్రువుల శరీరంలో అంతర్గత అవయవాలను దెబ్బతీస్తూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. గతంలో క్యూబాలో అమెరికా దౌత్యవేత్తలు ఎదుర్కొన్న ‘హవానా సిండ్రోమ్’ వెనుక కూడా ఇటువంటి సాంకేతికతే ఉందన్న వాదనలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చింది.
శబ్దాన్ని ఆయుధంగా వాడటం ప్రాచీన కాలం నుంచి ఉన్నప్పటికీ, అమెరికా ఇప్పుడు దానిని అత్యంత అధునాతన స్థాయికి తీసుకెళ్లింది. ఈ సోనిక్ ఆయుధాలను సాధారణంగా ‘నాన్-లెథల్’ (ప్రాణాంతకం కానివి) గా వర్గీకరించినప్పటికీ, వీటి ప్రభావం వల్ల శాశ్వత వినికిడి లోపం మరియు మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనిజులాలో జరిగిన ఈ ఆపరేషన్, భవిష్యత్తు యుద్ధాల్లో సంప్రదాయ ఆయుధాల కంటే ఇటువంటి సాంకేతిక ఆయుధాలే కీలక పాత్ర పోషించబోతున్నాయని స్పష్టం చేస్తోంది.