తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు కోసం విడుదలవుతున్న జీవోలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే ఆయన శాఖలో నిర్ణయాలు జరిగిపోతుండటం చూస్తుంటే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తికి సమాచారం లేకుండానే జీవోలు ఎలా విడుదలవుతున్నాయని, అసలు రాష్ట్రంలో పాలన ఎవరి నియంత్రణలో ఉందో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని హరీశ్ రావు ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పిన రేవంత్, ఇప్పుడు రాత్రికి రాత్రే అడ్డగోలుగా రేట్లు పెంచేలా జీవోలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ టికెట్ల దందా వెనుక ఒక ‘రాజ్యాంగేతర శక్తి’ ఉందని, ఒక్కో సినిమాకు కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని, తమకు నచ్చిన వారికి ఒకలా.. నచ్చని వారికి మరోలా వివక్ష చూపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు అహంకారంతో ఆ వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.