కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి అద్భుతమైన సత్తా చాటింది. ముఖ్యంగా తిరువనంతపురం కార్పొరేషన్‌లో గత 45 ఏళ్లుగా సాగుతున్న కమ్యూనిస్టుల పాలనకు ఎన్డీయే ముగింపు పలికింది. 101 వార్డులున్న ఈ కార్పొరేషన్‌లో ఎన్డీయే ఏకంగా 50 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కేవలం 29 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విజయోత్సాహంలో తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం విజయం కేవలం ప్రారంభం మాత్రమేనని, కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ‘అంతిమ లక్ష్యం’ అని ఆయన ప్రకటించారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి కేరళను రక్షించి, అభివృద్ధి పథంలో నడిపించే సత్తా కేవలం ఎన్డీయేకే ఉందని ఆయన ఉద్ఘాటించారు. కేరళలో శతాబ్దాలుగా ఉన్న ప్రజల విశ్వాసాలను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు.
కేరళలో కాంగ్రెస్ (UDF), కమ్యూనిస్టుల (LDF) మధ్య ఉన్న ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి ప్రధాని మోదీ ఆశించిన ‘వికసిత్ భారత్’ సాధనలో కేరళ అభివృద్ధి అత్యంత కీలకమని, అది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.