తేది:11-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీపై స్పష్టత ఇచ్చారు. అనర్హులే తొలగింపు, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, కేవలం అనర్హుల ఏరివేత మాత్రమే ఉంటుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కార్డుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం సచివాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన జర్నలిజం వృత్తికి కళంకం తెచ్చేలా అక్రెడిటేషన్ కార్డులనుదుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీవో 252లో ఉన్న చిన్నపాటి లోటుపాట్లను సవరించి, అర్హత ఉన్న ప్రతి విలేకరిని గుర్తించేలా పకడ్బందీ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారి నుంచి డెస్క్ జర్నలిస్టుల వరకు అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
డెస్క్ జర్నలిస్టులకు సమాన న్యాయం ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. బస్ పాస్‌లు సహా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు రిపోర్టర్లతో సమానంగా డెస్క్ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. జీవోలో ఇందుకు సంబంధించిన స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే కేబుల్ టీవీ ఛానెల్స్ విషయంలో ఉన్న అస్పష్టతను తొలగించాలన్నారు. ఉర్దూ రాష్ట్ర అధికార భాష అయినందున, ఇతర భాషల పత్రికల సర్క్యులేషన్, గ్రేడింగ్‌తో పోల్చకుండా ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని సూచించారు. ఉర్దూ పత్రికలు విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో జిల్లా, మండల స్థాయి విలేకరులకు కార్డులు మంజూరు చేసేలా నిబంధనలు సవరించాలని కోరారు.