తెలంగాణకు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఒక మీడియా సంస్థలో వచ్చిన కథనంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన వార్తలు ప్రసారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారని, వాస్తవాలకు దూరంగా ఉండే వార్తలతో వారి ప్రతిష్టను దెబ్బతీయవద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదని, శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. అలాగే, గత పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇచ్చిన ఉద్యోగాల వివరాలపై తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారని, కవిత వ్యవహారంపై కేటీఆర్, హరీశ్ రావు ఆందోళనలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకుంటుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు సాధించామని, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న నమ్మకం మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.