తారా విద్యార్థుల ప్రతిభ అభినందనీయం-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. తంజావూరు పెయింటింగ్ సర్టిఫికెట్ కోర్సు విజయవంతం.

తేది 9- 1- 2026 TSLAWS NEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డికి చెందిన విద్యార్థులు నాలుగు రోజులపాటు నిర్వహించిన తంజావూరు పెయింటింగ్ సర్టిఫికెట్ కోర్సులో కనబరిచిన ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను తారా కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇలాంటి కళా నైపుణ్య శిక్షణా కోర్సులు విద్యార్థుల్లో మానసిక స్థిరత్వం, సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని తెలిపారు. అరుదైన కళారూపాలను కాపాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కోర్సును నిర్వహించడం అభినందనీయమన్నారు.
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, సోలాపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ జ్ఞాన ప్రబోధిని, మల్లికార్జున హైస్కూల్, రాకంబాయి హత్తురే జూనియర్ కళాశాల, సోలాపూర్ వారి సంయుక్త సహకారంతో 25 గంటల తంజావూరు పెయింటింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు.
ఈ కోర్సును బోధించేందుకు సోలాపూర్‌కు చెందిన రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ మల్లికార్జున బిరాజ్‌దార్ కళాశాలకు వచ్చి, ఇక్కడే బస చేసి ప్రతిరోజు ఆరు గంటల చొప్పున శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు తంజావూరు పెయింటింగ్‌కు సంబంధించిన కనీస నైపుణ్యాలను నేర్పించారని తెలిపారు.
పెయింటింగ్ అన్నది మానసిక సౌందర్యానికి, సృజనాత్మకతకు ప్రతీక అని, ఈ కోర్సులో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని నైపుణ్యాలు సాధించడాన్ని కలెక్టర్, కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేకంగాఅభినందించారు.
కోర్సును సమర్థవంతంగా బోధించిన మల్లికార్జున బిరాజ్‌దార్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జగదీశ్వర్, అధ్యాపకురాలు డాక్టర్ అనురాధ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి ఉపాధి కల్పించే వృత్తి నైపుణ్య కోర్సుల ద్వారా విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం లభిస్తుందని, ఇతరులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను ప్రోత్సహించే దిశగా తారా కళాశాల నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.నాలుగు రోజుల పాటు నిర్వహించిన తంజావూరు పెయింటింగ్ సర్టిఫికెట్ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసిందని, ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపక బృందం పూర్తి సహకారం అందించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల ,జగదీశ్వర్, అర్థశాస్త్రo విభాగ అధ్యాపకులు జ్ఞాన ప్రబోధిని,సంస్థకు చెందిన మురళి, రిసోర్స్ పర్సన్ మల్లికార్జున బిరాజ్‌దార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *