తేది:9-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: పరిధిలో నిషేధిత చైనా మంజ (Chinese Manja) విక్రయాన్ని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఈ క్రమంలో మెదక్ టౌన్ మరియు నర్సాపూర్ ప్రాంతాల్లో చైనా మంజను అక్రమంగా విక్రయిస్తున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు.
పండుగలు, గాలిపటాల పండుగల సమయంలో చైనా మంజ వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చైనా మంజ వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు పెరుగుతున్నందున, దీనిపై ఎలాంటి సహనమూ చూపబోమని టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది.
చైనా మంజ తయారీ, రవాణా, నిల్వ, విక్రయం పూర్తిగా నిషేధమని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా చైనా మంజ విక్రయిస్తున్న వారి గురించి సమాచారం అందించే ప్రజల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక దాడులు కొనసాగుతాయని, ప్రజలు సహకరించి చైనా మంజ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.