న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత వేగవంతంగా అందించాలంటే కోర్టులు పోలీస్ సమన్వయం అత్యవసరం – జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి.

తేది:09-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా:న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా అందించాలంటే కోర్టులు మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. ఈ దిశగా జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు, పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వాటి పురోగతి, దర్యాప్తు నాణ్యత, చార్జ్‌షీట్‌లను సకాలంలో దాఖలు చేయడం, సమన్ల అమలు, నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ల (NBW) అమలు, సాక్షుల హాజరు, ఫోరెన్సిక్ నివేదికలు వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
కేసుల విచారణలో అనవసరమైన ఆలస్యం జరగకుండా పోలీస్ అధికారులు మరియు ప్రాసిక్యూషన్ విభాగం మరింత సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి సూచించారు. కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడం, నోటీసులు మరియు సమన్లను వేగవంతంగా అందించడం, కేసు డైరీలు మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించడం ద్వారా న్యాయ ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆమె తెలిపారు.
అలాగే పోలీస్ అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి, కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలసి రాజీ మార్గమే రాజమార్గమని, లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం సాధ్యమవుతుందని అవగాహన కల్పించిన ఫలితంగా మొత్తం 1051 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.
కేసుల పరిష్కారంలో చక్కటి సేవలందించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్, అదనపు జిల్లా జడ్జి శ్రీ నారాయణ, సెక్రటరీ లీగల్ సెల్ జగిత్యాల వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు, మేజిస్ట్రేట్ లు, శ్రీనిజ కొహిర్కార్,అరుణ్ కుమార్, పావని, నికిషా మరియు డీఎస్పీలు రఘు చందర్, రాములు, బార్ కౌన్సిల్ జగిత్యాల అధ్యక్షులు, అలాగే జగిత్యాల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *