‘ది రాజాసాబ్‌’కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. పెరగనున్న టికెట్ ధరలు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రభుత్వం రెండు విడతలుగా ధరల పెంపును ఖరారు చేసింది.

 

ధరల పెంపు ఇలా..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు (మొదటి మూడు రోజులు) మల్టీప్లెక్స్‌లలో రూ.132, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105 మేర ధరలను పెంచుకోవచ్చు. ఆ తర్వాత, అంటే ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.89, సింగిల్ స్క్రీన్‌లలో రూ.62 అదనంగా వసూలు చేసేందుకు అనుమతినిచ్చారు. అయితే, టికెట్ల ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని ఫిలిం ఫెడరేషన్‌కు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం షరతు విధించింది.

 

హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *