స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీఆర్ఎస్. అందుకోసం కొత్త కొత్తగా ప్లాన్స్ వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందని సర్పంచులతో ఆత్మీయ సమావేశం పెడుతూ, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ తాము అధికారంలోకి వస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రోజుకో జిల్లాని చుట్టేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు రోజుకో నియోజకవర్గం లేదంటే జిల్లాను చుట్టేయాలని డిసైడ్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎక్కువగా గెలుపొందాని ప్లాన్ చేస్తున్నారు. బుధవారం ఖమ్మం కాగా, గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన పంచాయితీ సర్పంచులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది శూన్యమని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అవకాశవాదులతో చేతులు కలిపి పార్టీ మారారని దుమ్మెత్తిపోశారు. ఆదిలాబాదులో రెవెన్యూ డివిజన్ అడిగితే తాము మళ్ళీ అధికారంలోకి వస్తామో , రామోనని సదరు మంత్రి అన్నారని ఆరోపించారు.
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌లో ఉత్సాహం నింపు ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జూపల్లి కృష్ణారావుకి తెలిసిపోయిందన్నారు. ప్రాజెక్ట్‌లను నిర్మించే ప్రభుత్వాలను చూశామని, కూల్చే ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదన్నారు. తెలంగాణలో చెక్ డ్యాంలను బాంబులు పెట్టీ కూల్చివేశారని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే రాష్ట్రం దివాలా తీసిందని, కేసీఆర్ అప్పుల పాలు చేశారని మాట్లాడుతున్నారని చెప్పారు. హామీలు అమలు చెయ్యకుండా కేసీఆర్‌పై ఆ నెపాన్ని నెట్టివేస్తున్నారని రుసరుసలాడారు. తెలంగాణలో యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, షాపులో కాదు యాప్‌లో యూరియా ఇస్తామని ప్రభుత్వం మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో రైతన్నను కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, యూరియా కోసం రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. కేసీఆర్ హయంలో నాట్లు వేసే కాలంలో సకాలంలో రైతు బంధు అకౌంట్లో పడేదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఒకే ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందన్నారు.
అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశామంటూ చెప్పే ప్రయత్నం చేశారు.కేవలం 10 శాతం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడ్డారు. నిజంగా పాలమూరును సీఎం రేవంత్‌రెడ్డి పండబెట్టారని విమర్శించారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని ముఖ్యమంత్రి ఉన్నారని, బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని సీఎం, నీళ్లపై చర్చిద్దాం రండి అని అంటున్నారని కేడర్ని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈసారి గులాబీ జెండా ఎగరాలన్నారు. పనిలో పనిగా మంత్రి జూపల్లి కృష్ణారావుని టార్గెట్ చేశారు. ఆయన దౌర్జన్యం గురించి అంతా తెలుసని, అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బిఆర్ఎస్ పార్టీని గెలిచిందన్నారు.
కేసిఆర్ తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో గులాబీ జెండా మళ్లీ ఎగరాలన్నారు. ఇకపై హర్షవర్ధన్ రెడ్డి ప్రజల మధ్యలోనే ఉండాలని, ఏ కష్టం వచ్చినా నియోజకవర్గ ప్రజలకు ఆయనఅందుబాటులో ఉంటారన్నారు.