తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు ప్రజలను కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని, ‘సంక్షోభ భారత్’ను సృష్టిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో ‘VB-G RAM G’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించామని తెలిపారు.
ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) పూర్వపు స్థితిలో పునరుద్ధరించే వరకూ మా పోరాటం ఆగదు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు,” అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర దాగి ఉందని, కేంద్రం వైఖరిని ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీల్లో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పంపిస్తామని తెలిపారు.