తిరుమల పవిత్రతపై రాజకీయ కుట్ర..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్ర పవిత్రతకు మచ్చ తెచ్చేందుకు జరిగిన ఓ నీచమైన రాజకీయ కుట్ర బట్టబయలైంది. తిరుమల కొండపై, అందునా పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం సీసాలు దొరికాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక.. ఉద్దేశపూర్వకమైన దుర్మార్గపు ప్లాన్ ఉందని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా తేల్చారు.

ప్రభుత్వానికి, టీటీడీ యంత్రాంగానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా.. కింద నుంచి ఖాళీ సీసాలను తెచ్చి, ప్లాన్ ప్రకారం అక్కడ పడేసి, వాటిని వీడియోలు తీసి వైరల్ చేసిన ఘరానా మోసాన్ని అధికారులు రట్టు చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఈ వ్యవహారంలో ఓ వైసీపీ కార్యకర్త, ఓ ప్రముఖ మీడియా ఫొటోగ్రాఫర్ కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో వెల్లడికావడం గమనార్హం.

జనవరి 4, 2026న తిరుమలలోని పోలీస్ అతిథి గృహం సమీపంలో, బాలాజీ కాలనీలో పదుల సంఖ్యలో మద్యం సీసాలు దర్శనమిచ్చాయని, అలిపిరి తనిఖీలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్, పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, ఫాస్ట్‌ట్యాగ్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా అసలు విషయం బయటపడింది.

 

తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్ళపాక కోటి, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణతో కుమ్మక్కై ఈ ప్లాన్ వేశారు. కోటి తిరుపతి నుంచే కొన్ని పాత ఖాళీ మద్యం సీసాలను సేకరించి కారులో తిరుమలకు తెచ్చాడు. వాటిని ప్లాన్ ప్రకారం కౌస్తుభం అతిథి గృహం బయట ఉన్న పొదల్లో పడేశాడు. అనంతరం తన మనుషులకు సమాచారం ఇవ్వగా.. సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఆదేశాల మేరకు గిరి, ప్రసాద్, ముకేష్ అనే వ్యక్తులు అక్కడికి వెళ్లి వీడియోలు తీసి వైరల్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీయడం, టీటీడీ సెక్యూరిటీని విఫలమైనట్టు చూపించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం, అలాగే ఈ “సెన్సేషన్” ద్వారా సదరు మీడియా సంస్థలో గుర్తింపు పొందడమే వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు. జనవరి 7 సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తిరుపతి జూపార్క్ రోడ్డులోని దేవలోక్ వద్ద కోటి, మోహన్ కృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

తిరుమలలో కుట్ర చేశారు.. భానుప్రకాష్ రెడ్డి

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు మద్యం బాటిళ్లను అక్కడ పెట్టి ప్రచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం భగవంతుడిని అడ్డం పెట్టుకుని నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. త్వరలోనే ఆధారాలు బయటపెడతామని తెలిపారు.

 

తిరుమలలో తప్పు జరిగితే అది మీ అసమర్థతే.. వైసీపీ

 

“తిరుమల పవిత్రతను కాపాడటం చేతకాక.. కూటమి నేతలు స్వామివారిని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నిత్యం ఏదో ఒక ‘డ్రామా’ ఆడుతున్నారు. నిన్న లడ్డూ అన్నారు, నేడు మద్యం సీసాలు అంటున్నారు. అధికారంలో ఉన్నది మీరు.. భద్రత కల్పించాల్సింది మీరు.. అక్కడ తప్పు జరిగితే అది మీ అసమర్థత కాదా?” అని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని, దేవుడిని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తే భక్తులు క్షమించరని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *