ప్రత్యేక శ్రవణ గ్రంథాలయం ప్రారంభం, దృష్టిలోపం గల వారి కోసం ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక శ్రవణ గ్రంథాలయం ప్రారంభం,రాష్ట్రంలోనే జిల్లాలో మొట్టమొదటిది-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.

తేది:8- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

అంధులు సౌండ్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి-సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్.

సంగారెడ్డి జిల్లా: దృష్టిలోపం (విజువల్లీ ఛాలెంజ్డ్) గల వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్య, సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య,శాసనసభ్యులు చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గల వారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరని తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో కంప్యూటర్‌ను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడం, చదువు, అభ్యాసం, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. దీని ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలరని చెప్పారు. ఆఫ్‌లైన్‌తో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్‌లైన్ విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
దృష్టిలోపం గల వారి వినియోగానికి అనుగుణంగా 10 ఏంజెల్ ప్లేయర్లు (డీజీ ప్లేయర్లు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు, ఎడిటబుల్ ఫైళ్లు, పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్న పుస్తకాలను కాపీ చేసి వినియోగించుకోవచ్చని, కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు, హిందీతో తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో వినే సౌకర్యం ఉందని, భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం ఈ లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నారు. అలాగే బ్రెయిలీ ప్రింటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను (పీడీఎఫ్, జేపీజీ లేదా ముద్రిత రూపంలో) బ్రెయిలీ లిపిలోకి మార్చి ముద్రించడం ద్వారా దృష్టిలోపం గల వారు బ్రెయిలీ లిపి ద్వారా పుస్తకాలను చదవగలరని వివరించారు.
ఈ సౌండ్ లైబ్రరీ దృష్టిలోపం గల విద్యార్థుల విద్యా పురోగతి, స్వావలంబనకు తోడ్పడటంతో పాటు ఆధునిక సాంకేతికతను వారికి మరింత దగ్గర చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా దృష్టిలోపం గల వారి కోసం జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. దివ్యాంగులు ఈ సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకున్నప్పుడే దీని సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అంతకు ముందు లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు నిర్వహించి, ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, పంచాయతీ రాజ్ శాఖ డీఈ దీపక్, వివిధ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, డీడబ్ల్యూఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *