తేది:7-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా: సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా మెదక్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో “మహిళల రక్షణ – పిల్లల సంరక్షణ” అనే అంశంపై విస్తృత స్థాయి సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు మాట్లాడుతూ, మహిళలు మరియు పిల్లలు సైబర్ నేరాలకు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారని తెలిపారు.
ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఫేక్ అకౌంట్లు, బ్లాక్‌మెయిల్, సైబర్ వేధింపులు, అశ్లీల సందేశాలు, లింకులు, ఆన్‌లైన్ ట్రాప్‌ల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండటం, వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంక్ వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు.
మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా త్వరితగతిన సహాయం పొందవచ్చని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటేనే సమాజంలో భద్రత పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆన్‌లైన్ వేదికలను వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై మరింత అవగాహన కల్పించారు. మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.