మావోయిస్టుల లొంగుబాటు ‘సరెండర్’ కాదు.. అది ‘లీగల్’ కావడం: మాజీ నేత జంపన్న విశ్లేషణ

‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో దేశవ్యాప్తంగా మావోయిస్టులు భారీగా పోలీసుల ఎదుట లొంగిపోతున్న నేపథ్యంలో, మాజీ మావోయిస్టు నేత జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడవిని వదిలి వస్తున్న వారిని ‘సరెండర్’ (లొంగిపోవడం) అయ్యారని పిలవడం సరైన పదం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట వ్యతిరేక మార్గం నుండి బయటకు వచ్చి, రాజ్యాంగబద్ధమైన పౌరులుగా జీవించడమంటే అది ‘లీగల్’ (చట్టబద్ధం) కావడం మాత్రమేనని, వారిని తక్కువ చేసేలా పదజాలాన్ని వాడకూడదని ఆయన సూచించారు.

నక్సలైట్ పార్టీల నుండి బయటకు వచ్చే వారిని మావోయిస్టు పార్టీ ‘ద్రోహులు’ అని, ‘మోకరిల్లిన వారు’ అని అవమానించడాన్ని జంపన్న తీవ్రంగా ఖండించారు. దశాబ్దాల పాటు ఆస్తులు, కుటుంబాలను వదిలి త్యాగాలకు సిద్ధపడి పనిచేసిన వారు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు లేదా సైద్ధాంతిక విభేదాల వల్ల బయటకు వస్తారని ఆయన వివరించారు. అలాంటి వారిని సమాజంలో గౌరవం లేకుండా చేయడం విప్లవానికే నష్టమని, పార్టీని వదిలిన 99 శాతం మంది పేద వర్గాలకు చెందినవారేనని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం లేదా మీడియా అడవిని వదిలిన వారు ‘జనజీవన స్రవంతి’లోకి వచ్చారని అనడం కూడా సరికాదని జంపన్న వాదించారు. వారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తారని, పార్టీ నుండి బయటకు వచ్చినంత మాత్రాన వారిలోని కమ్యూనిస్టు విలువలు పోవని తెలిపారు. రాజ్యాంగ పరిధిలో ఉంటూనే ప్రజల సమస్యలపై పోరాడటానికి, ప్రజాస్వామ్య వేదికలపై పనిచేయడానికి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని, సమాజంలో వారిని గౌరవప్రదంగా జీవించనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *