ఆర్డీటీ సేవలు అభినందనీయం-జిల్లా విద్యాధికారి రాజేందర్.

​తేది:07-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ కొనియాడారు. మండలంలోని గొర్లవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ సౌజన్యంతో సమకూర్చిన ఫర్నిచర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. పాఠశాల హెచ్‌ఎం అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు పాఠశాలలకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, సైన్స్ ల్యాబ్ పరికరాలు, క్రీడా సామగ్రిని అందిస్తూ విద్యార్థుల ప్రగతికి ఆర్డీటీ తోడ్పడడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పాఠశాలలకు ఈ సేవలు విస్తరించేలా ఆర్డీటీ తమ వంతు సహకారం అందిచాలని కోరారు. ​ఆర్డీటీ రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ లీలా సుజిత్ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి విద్యతోనే సాధ్యమని, అందుకే పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల కంటే పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. సర్పంచ్ మందల లావణ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ విజయపాల్ రెడ్డి, సీఎంఓ రమేష్, ఆర్డీటీ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, రుచి, ఉప సర్పంచ్ రాజ్ పాల్, ఉపాధ్యాయులు సుభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *