అమెరికా రక్షణ శాఖ అధికారులు ఏదైనా దేశంపై మెరుపు దాడులు లేదా రహస్య సైనిక ఆపరేషన్లు చేసే సమయంలో గంటల తరబడి కార్యాలయాల్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. అటువంటి అత్యవసర సమయాల్లో వారు బయటకు వెళ్లే వీలుండదు కాబట్టి, తక్షణ ఆహారం కోసం పెద్ద సంఖ్యలో పిజ్జాలను ఆర్డర్ చేస్తారు. దీనివల్ల పెంటగాన్ పరిసరాల్లోని పిజ్జా అవుట్‌లెట్లకు ఒక్కసారిగా గిరాకీ పెరుగుతుంది. దీనినే సోషల్ మీడియాలో ‘పెంటగాన్ పిజ్జా ఇండెక్స్’ అని పిలుస్తారు. తాజాగా జనవరి 3న వెనుజులాపై అమెరికా దాడులు జరపడానికి ముందు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి 3:30 గంటల వరకు పిజ్జా ఆర్డర్లు భారీగా పెరగడం ఈ థియరీని బలపరుస్తోంది.
జనవరి 3న వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా పట్టుకునే ఆపరేషన్ సమయంలో, పెంటగాన్ సమీపంలోని ఒక ప్రముఖ పిజ్జా షాపులో ఆర్డర్లు గంటన్నర పాటు విపరీతంగా వచ్చాయి. ఆ ఆపరేషన్ ముగియగానే మళ్ళీ పది నిమిషాల్లో ఆర్డర్లు సున్నాకి పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలోనే కారకాస్ నగరంపై అమెరికా వైమానిక దాడులు చేసి మదురోను అదుపులోకి తీసుకుంది. గతంలో సోవియట్ యూనియన్‌తో ప్రచ్ఛన్న యుద్ధం జరిగినప్పుడు, గల్ఫ్ యుద్ధం సమయంలో మరియు ఒసామా బిన్ లాడెన్ ఆపరేషన్ సమయంలో కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు పెరిగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ‘పిజ్జా ఇండెక్స్’ అనేది కేవలం యాదృచ్ఛికం అని కొందరు కొట్టిపారేసినా, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నిపుణులు మాత్రం దీనిని గమనిస్తూ ఉంటారు. పెంటగాన్ అధికారులు సాధారణంగా రాత్రిపూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసులోనే ఉన్నారంటే అక్కడ ఏదో పెద్ద వ్యూహం సిద్ధమవుతుందని అర్థం. ఇలా పిజ్జా ఆర్డర్ల డేటా ఆధారంగా అమెరికా చేసే రహస్య దాడులను ముందే పసిగట్టవచ్చని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం వెనుజులా పరిణామాల నేపథ్యంలో ఈ ‘పిజ్జా థియరీ’ మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.