
తేది:03-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలంలోని ఓసి త్రీ గని బ్లాస్టింగ్ తో పరశురాం పల్లి గ్రామంలో గోడలు కూలి ఇల్లు పాక్షికంగా ధ్వంసమయింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగిన బాంబు బ్లాస్టింగ్ వల్ల పరశురాం పల్లి గ్రామానికి చెందిన బేతి మల్లక్క ఇంటి గోడలు కూలిపోగా పాక్షికంగా ఇల్లు ధ్వంసమయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో కూడా బ్లాస్టింగ్ వల్ల పలుమార్లు ఇండ్ల గోడలకు బీటలు బారయి. ప్రమాద విషయం తెలుసుకున్న పరశురాం పల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్, కార్యదర్శి మదన్ లు మల్లక్క ఇంటికి వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ బ్లాస్టింగ్ వల్ల గ్రామంలోని ఇండ్లు ప్రమాదం అంచున ఉన్నాయని గతంలో పలుమార్లు కూడా గోడలు కూలిపోయాయని అన్నారు. ఈ విషయమై సింగరేణి జిఎంకు , స్థానిక తాసిల్దార్ కు లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గోడలు కూలి ఇల్లు ధ్వంసమైన మల్లక్క కుటుంబానికి సాయం అందించాలని సింగరేణి అధికారులకు సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. గోడలు కూలిన ఇంటిని ఆర్ ఐ దేవేందర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.