తెలంగాణా భవన్ దీక్షా దివస్ లో మంత్రి కేటీఆర్: ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం!!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బీజంపడిన రోజు నవంబర్ 29. 2009వ సంవత్సరంలో రాష్ట్ర సాధన కోసం సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కేసీఆర్. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అని నినదిస్తూ ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ పీఠం దిగి రావడానికి నాంది పలికారు.

 

తెలంగాణ దీక్షా దివస్ గా ప్రతి సంవత్సరం తెలంగాణ ఉద్యమ కాలం నాటి పోరాట పటిమను గుర్తు చేసుకుంటున్న బీఆర్ఎస్, తాజా ఎన్నికల నిబంధనల నేపథ్యంలో దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించలేకపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సరిగ్గా నేటికి 14 సంవత్సరాలు పూర్తయింది.

 

ఈ సందర్భంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తే, ఎన్నికల అధికారులు మాత్రం అందుకు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చేపట్టిన దీక్ష దివస్ పై కేంద్ర ఎన్నికల సంఘం స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడుపు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలియజేసింది.

 

సైలెంట్ పిరియడ్ కొనసాగుతుందని, పార్టీ కార్యాలయాలలో ప్రచారం నిర్వహించవద్దని ఈసీ అధికారులు సూచించగా, దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్ళారు . ఇక ఈ క్రమంలో తెలంగాణ భవన్ వేదికగా జరిపిన దీక్షా దివస్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా రక్తదానం చేశారు.

 

ఇక ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ భవన్ లోపలే కార్యక్రమాలను నిర్వహించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాల వేయొద్దని తేల్చి చెప్పారు ఎన్నికల అధికారులు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ అన్నారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *