న్యూయార్క్ నగర నూతన మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన జోహ్రాన్ మమ్దానీ, తన పదవీ కాలం ప్రారంభంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గతంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ఆయన రద్దు చేశారు. ముఖ్యంగా, ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ అలయన్స్ (IHRA) రూపొందించిన యూదు వ్యతిరేకత (Antisemitism) నిర్వచనాన్ని నగర అధికారిక విధానాల నుండి తొలగించారు. ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మమ్దానీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇజ్రాయెల్‌ను బహిష్కరించాలని కోరే (BDS ఉద్యమం వంటి) ఆందోళనలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. మేయర్‌గా తన మొదటి రోజే ఆయన తన “నిజ స్వరూపం” బయటపెట్టారని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ విమర్శించింది. యూదు వ్యతిరేకతపై పెట్రోల్ పోసేలా ఈ నిర్ణయం ఉందని ఆ దేశం ఆరోపించింది. అయితే, పాలస్తీనా హక్కుల కోసం మాట్లాడేవారి గొంతు నొక్కేయడానికి పాత నిర్వచనం ఉపయోగపడుతోందని వాదించే ఇస్లామిక్ మరియు మానవ హక్కుల సంఘాలు ఈ మార్పును స్వాగతించాయి.
ఈ వివాదంపై మమ్దానీ స్పందిస్తూ.. న్యూయార్క్‌లోని అందరినీ, ముఖ్యంగా యూదులను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే నిర్వచనంపై ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. 34 ఏళ్ల మమ్దానీ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం, ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వంటి వారు ఆయనను అడ్డుకోవాలని చూసినా విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఉత్తర్వుల రద్దు న్యూయార్క్ రాజకీయాల్లో మరియు అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.