హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీపై తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ‘ఈగల్ టీమ్’ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మాదకద్రవ్యాలు సేవించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటన స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

నానక్‌రామ్‌గూడలో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు జరపగా, సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. పోలీసులు తక్షణమే ఆయనకు డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో ‘పాజిటివ్’ అని ఫలితం వచ్చింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం నర్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు ఇలాంటి మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం సుధీర్ రెడ్డిని నిబంధనల ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ పార్టీ వెనుక ఉన్న పెడ్లర్లు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడు వరుసగా మూడోసారి డ్రగ్స్ కేసులో దొరకడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *