తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న క్షేత్రంలో విజేతలను కలిసి అభినందించారు. శనివారం జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచిన అభ్యర్థులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను రాజకీయ పార్టీ పెట్టడానికి, పోరాడటానికి కావాల్సిన ధైర్యాన్ని, చైతన్యాన్ని ఇచ్చింది తెలంగాణ గడ్డ అని భావోద్వేగంతో పేర్కొన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాలే తనలో రాజకీయ శక్తిని నింపాయని కొనియాడారు.
తెలంగాణలో ప్రస్తుతం నిజాయితీ కలిగిన యువ నాయకత్వం అవసరమని, సిద్ధాంత బలమే నాయకుడికి అసలైన కవచమని పవన్ పిలుపునిచ్చారు. పదవుల కోసం కాకుండా ప్రజల కష్టాలను తీర్చే సేవకులుగా ఎదగాలని గెలిచిన ప్రతినిధులకు సూచించారు. పోటీ చేసిన స్థానాల్లో సుమారు 50 శాతం విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదని, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో జనసేన మార్క్ కనిపించడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం మొదలుపెట్టి, గ్రామ స్థాయిలో జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన ఏకైక ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి.. ప్రజల మధ్య ఐక్యత కోసం మనమంతా కలిసి పనిచేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పారదర్శకమైన పాలన అందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని ప్రజాప్రతినిధులను కోరారు. పవన్ కల్యాణ్ మాటలతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.